Home » Book Intro » కొంటె బొమ్మ సాహసాలు

 

కొంటె బొమ్మ సాహసాలు

 

కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో ” అనే చిన్న పిల్లల నవలకి అనువాదం నా ఈ కొంటె బొమ్మ సాహసాలు. ఈ పుస్తకం మొదటగా 1882లో ఇటలీలో ముద్రితమైంది. తర్వాతి కాలంలో పలుమార్లు పునర్ముద్రితమైంది, వివిధ భాషలలోకి అనువాదమైంది. ఓ సాహితీప్రక్రియ, కాలగమనంలో దాదాపు 129 ఏళ్ళు నిలవగలిగిందంటే, దాని కథాంశం సజీవమనేది సుస్పష్టం!
ఇక కథలోకి వస్తే, ఓ దారుశిల్పి కొయ్యతో ఒక కీలుబొమ్మని రూపొందించి, దాన్ని ఆటలాడిస్తూ తన పొట్టపోసుకోవాలనుకుంటాడు. కానీ అనూహ్యంగా ఆ కీలుబొమ్మ ప్రాణం తెచ్చుకుని మాములు మనిషిలా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఎన్నో సాహసాలు చేస్తుంది. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటుంది. చివరికి ఏం జరిగిందనేది ఆసక్తిదాయకం.
కథలోని పాత్రధారుల పేర్లు మన నేపధ్యానికి తగ్గట్టుగా ఉండకపోయినా, ఆసక్తిదాయకంగా సాగిపోయే కథనం ఆ లోపాన్ని కప్పి పెడుతుంది. ఇందులోని ప్రధాన పాత్రలలో కొన్ని పక్షులు, జంతువులు, కీటకాలు కూడా ఉన్నాయి, అవి మనుషుల్లానే మాట్లాడుతాయి. పిల్లల ప్రవర్తనకి సంబంధించిన ఎన్నో మంచి మాటలని తమ నోటి ద్వారా పలికిస్తాయి. ఎక్కువగా సంభాషణల రూపంలో ఉన్న ఈ నవలిక వినోదాత్మకంగానే కాకుండా, సందేశాత్మకంగాను ఉంటుంది.
పుస్తకం ఇటీవలే విడుదలైంది. పీపుల్స్ ట్రస్ట్ వారి అనుబంధ ప్రచురణ సంస్థ “పీచిక్స్” ఈ పుస్తకాన్ని ప్రచురించింది. రూ.60/- ఖరీదున్న ఈ 128 పేజిల పుస్తకానికి పంపిణీదారులు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోను లభిస్తుంది. మీరు చదవండి. మీ పిల్లల చేత చదివించిండి.

Tags: , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment