Home » Book Intro » ముసలోడూ సముద్రమూ

 

ముసలోడూ సముద్రమూ

 

ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన “Old Man and the Sea” అనే నవలికకి తెలుగు అనువాదం ఇది. పులిట్జర్ ప్రైజు, నోబెల్ ప్రైజు గెలుచుకున్న పుస్తకం ఇది.
క్యూబాకి చెందిన శాంటియాగో అనే ముసలి జాలరి కథ ఇది.
అనూహ్యంగా, అతనికి ఎనభై నాలుగు రోజులపాటు ఒక్క చేప కూడా దొరకదు. అతను అత్యంత దురదృష్టవంతుడని ముద్రవేస్తారు తోటి జాలర్లు.
అయినప్పటికీ, అంతటి విపత్కర పరిస్థితులలోనూ ధైర్యం కోల్పోడు శాంటియాగో. జవసత్వాలు కూడగట్టుకుని ఎనభై ఐదో రోజు వేటకి బయల్దేరుతాడు. తాను పెద్ద చేపను పట్టగలనననే నమ్మకంతో వేటకి బయల్దేరుతాడు.
ఈ సారి సముద్రంలో చాలా దూరం వెడతాడు. చేపలు దొరికితేగానీ ఇంటికి తిరిగివెళ్ళడానికి సిద్ధపడక, రోజుల తరబడి వేటాడడానికి సన్నద్ధమవుతాడు. ఎరలు, గాలాలు వేసి పడవని సముద్రంలో పోనిస్తుంటాడు.
ఈ ముసలాడికి దగ్గరి బంధువులెవరూ లేకపోవడంతో ఒంటరి జీవితానికి అలవాటు పడతాడు. వేటకి వెళ్ళినప్పుడు తనలో తానే గట్టిగా మాట్లాడుకుంటాడు. జలచరాలతో మాట్లాడుతుంటాడు.
మొదటి రోజు మధ్యాహ్నం ఆకాశంలో ఓ గద్ద కనబడుతుంది.
“దీనికి ఏదో కనపడింది. ఊరికే చూడడానికి రాలేదిది” బిగ్గరగా అంటాడు ముసలోడు. బహుశా ఆ డేగకి పిచ్చకమీన కనబడి ఉంటుంది. పిచ్చకమీనలు డాల్ఫిన్స్‌కి ఆహారం, డాల్ఫిన్లు ట్యూనా చేపలకి… ట్యూనా చేపల మార్లిన్ చేపలకి ఆహారం. కాబట్టి తనకి మార్లిన్ చేప దొరికే అవకాశం ఉన్నట్లు భావిస్తాడు. అది నిజంగానే అతి పెద్ద చేప. రకరకాల చేపలు దొరికినట్లే దొరికి తప్పించుకుంటూంటాయి. ఉన్నట్లుండి హఠాత్తుగా అతని గాలానికి ఓ పెద్ద చేప… అతను పట్టుకోవాలని కోరుకున్న మార్లిన్ చిక్కుతుంది. అదెంత పొడవుందో చూడాలనుకుంటాడు శాంటియాగో, కానీ అది వృధా ప్రయాస అని గ్రహిస్తాడు. గాలానికి చిక్కిన చేపని గుంజడానికి ముసలోడు ప్రయత్నిస్తే, అది చాల బరువని, మరింత గట్టిగా ప్రయత్నిస్టే… గాలానికి కట్తిన తాడు తెగిఫొవచ్చని, పడవ తలక్రిందులుకావచ్చని గ్రహిస్తాడు. మార్లిన్ పడవని వాయువ్యదిశగా లాక్కుపోతూంటుంది. గాలానికి చిక్కిన ఆ చేపని దానిష్టం వచ్చిన దిశకి పోనిస్తూ, దాని వెనకే పడవ నడిపిస్తాడు ముసలోడు. అది అలసిపోయి, నీటి పై భాగానికి వస్తుందని అతని ఉద్దేశం. సూర్యాస్తమయం అవుతుంది. కానీ మార్లిన్ నీటి పైకి రాలేదు, తన దిశని మార్చుకోలేదు.
“ఎప్పుడో మధ్యాహ్నం అనగా ఆ చేప నా గాలానికి చిక్కింది, అయినా అది ఇంకా నాకు కనిపించలేదు” అనుకుంటాడు ముసలోడు.
హవానా తీరానికి దూరంగా, మిణుకుమిణుకు మంటున్న దీపాలకు మరింత దూరంగా ఆ చేప తనకు తీసుకుపోతున్నా ముసలోడు కంగారు పడడు. ఆ రాత్రంతా వేచి చూద్దాం అనుకుంటాడు. గతంలో ఎన్నో మార్లిన్‌లను పట్టుకున్నప్పటికీ ఈ చేప ప్రత్యేకమైనదని ముసలోడు భావిస్తాడు. ఎందుకంటే తీరం నుంచి దూరంగా ఉండడం దీనికి తెలుసు. బెదిరిపోయి ఎగరకుండా తెలివిగా ఎలా తప్పించుకోవాలో దానికి తెలుసు అని ముసలోడు అనుకున్నాడు. పూర్తిగా చీకటి పడుతుంది. ఆ చేప ఉన్నట్లుండి గాలం కొక్కేన్ని గట్టిగా లాగుతుంది. ముసలోడు బొక్కబోర్లా పడతాడు. ముఖం మీద దెబ్బ తగులుతుంది. చేప తగులుకున్న గాలం తీగని వీపుకు చుట్టుకుంటాడు. అది గాయం చేస్తూంటుంది. అయినా లెక్కచేయడు. “ఓ చేపా నేను చచ్చేదాక నిన్ను వదలను” అంటూ బిగ్గరగా కేకేసాడు. అలసిపోయి, నిద్రలోకి జారుకుంటాడు.
తెల్లారుతుంది. ఆ చేప తను అనుకున్నట్లు అలసిపోవడం లేదని ముసలోడు గ్రహిస్తాడు.
రెండో రోజు ఉదయం ఆ చేప లోతుల్లో కాకుండా నీటికి పైపైన ఈదుతూంటుంది. ఇంతలో ఓ పిట్ట వచ్చి పడవ మీద వాలుతుంది. ముసలోడు ఆ పిట్టతో కబుర్లు చెబుతాడు. చేప మాత్రం ముందుకు సాగుతునే ఉంది. ఉన్నట్లుండి చేప తీగని గట్టిగా లాగేస్తుంది. ముసలోడు తూలి పడవ ముందు భాగంలో పడిపోతాడు. మళ్ళీ దెబ్బ తగులుతుంది. ఈ సారి కుడి చేతికి. రక్తం వోడుతుంది. రక్తాన్ని ఆపడం కోసం చేతిని సముద్రపు నీటిలో ఉంచుతాడు. శక్తి ఉడిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడో పట్టి ఉంచిన ట్యూనా చేపని పచ్చిగానే తింటాడు. మధ్యాహ్నానికి చేప సముద్రం పైకి వస్తుంది. దాన్ని చూసి ముసలోడు విస్తుబోతాడు.
“అబ్బో, ఇది నా పడవ కన్నా రెండు అడుగులు పొడవుంది” అనుకుంటాడు ముసలోడు.
చేప ముందుకు సాగుతూ ఉంటుంది. “అది ఎంత పెద్దది, ఎంత గొప్పది అయితే ఏంటి? నేను దానిని చంపి తీరుతాను” అనుకుంటాడు ముసలోడు. ఒక మనిషి ఏం చేయగలడో, ఎంత కష్టాన్ని భరిస్తాడో దానికి చూపాలనుకుంటాడు.
సముద్రంలో వీరి ప్రయాణం సాగుతునే ఉంటుంది. ఈ సారి చేప ఉత్తరం వైపు తిరుగుతుంది. ముసలోడు తన అలసటని, నిస్సత్తువని మరచిపోడానికి బేస్ బాల్ లీగ్ పోటోలను తలచుకుంటాడు. కాలికి దెబ్బ తగిలినా, పట్టుదల ధైర్యంతో ఆడిన డిమాగియోని గుర్తు చేసుకుంటాడు. ఇంతలో ఇంకో గాలానికో డాల్ఫిన్ చిక్కుకుంటుంది. దాన్ని పైకి లాగి పడవలో పడేస్తాడు. చీకట్లు ముసురుతాయి. డాల్ఫిన్‌ని తిని గాలానికి చిక్కుకున్న ఆ మార్లిన్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు.
మూడో రోజు తెల్లారుతుంది. వాతావారణం మారిపోతుంది. తుఫాను సూచనలు కనపడతాయి. చేప నీటిపైకి వచ్చి ముసలోడిని కవ్విస్తూ ఉంటుంది. బల్లేనికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. పడవ కిందకి చేరి తోకతో కొడుతూ ఉంటుంది. చివరికి మధ్యాహ్నం సమయానికి దానికి బల్లెం గుచ్చి, పడవకు కట్టేయగలుగుతాడు ముసలోడు. ఇంటి వైపు నైరుతీ దిశగా తిరుగుప్రయాణం మొదలుపెడతాడు.
అయితే చేప గాయాల నుంచి స్రవిస్తున్న రక్తం షార్క్ చేపలను ఆకర్షిస్తుంది. అవి ఆ చేప మీద దాడి చేస్తాయి. ముసలోడు చేతిలో ఉన్న బల్లెంతో సొరచేపలను గాయపరచడం, తరమడం చేస్తాడు. కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. సొరచేపలు మార్లిన్‌ని చేపని పూర్తిగా తినేస్తాయి. సాయంత్రం అవుతుంది. మార్లిన్ కంకాళంతో ముసలోడు ఒడ్డుకు చేరుతాడు. పూర్తిగా అలసిపోయి ఇల్లు చేరుతాడు.
ఇంతకీ ముసలోడు ఓడినట్లా? గెలిచినట్లా?
చేప పోయుండచ్చు, కానీ అంతటి ఒత్తిడిలోనూ ముసలాడు తన హుందాతనాన్ని, పట్టుదలని వదల్లేదు. మనిషి తలుచుకుంటే ప్రతికూల పరిస్థితులపై సైతం ఆధిపత్యం చెలాయించవచ్చని, విషమమైన సంఘటనలు ఎదుర్కోవచ్చని ముసలోడి కథ నిరూపిస్తుంది. అతడు విజేత.

* * *

“ముసలోడూ, సముద్రమూ” అనే ఈ పుస్తకాన్ని పీకాక్ క్లాసిక్స్ ప్రచురించింది. పృథ్వీరాజ్, దాసరి రమేష్ బాబు తెలుగులోకి అనువదించారు. 94 పేజీలున్న ఈ పుస్తకం ధర 50 రూపాయలు. విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్ లోనూ, పీకాక్ క్లాసిక్స్ వారి వద్ద ఈ పుస్తకం లభిస్తుంది.

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment