Home » Book Intro » నాన్నా తొందరగా వచ్చేయ్

 

నాన్నా తొందరగా వచ్చేయ్

 

నా అనువాద కథలు రెండో సంకలనం “నాన్నా తొందరగా వచ్చేయ్”. ఇందులో పదిహేను కథలు. ఇవన్నీ దేనికి దానికి విభిన్నమైనవి. ఈ సంకలనంలోని కొన్ని కథలు హృదయాన్ని తాకుతాయి. కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి, మరికొన్ని పాఠకుల పెదాలపై చిరునవ్వులని కదలాడిస్తాయి. ఈ సంకలనంలోని కథలని క్లుప్తంగా పరిచయం చేసుకుందాం.

అమృత వర్షిణి: ఇతర దేశాలలో నిషేధించిన పురుగుమందులను మన దేశంలో యధేచ్ఛగా వాడడం వల్ల ఏం జరుగుతుందో ఈ కథ చెబుతుంది, ముస్లిం కుటుంబంలో పుట్టినా, శాస్త్రీయ సంగీతంలో నైపుణ్యం సాధించడానికి కృషి చేస్తున్న ఓ యువతి జీవచ్ఛవంలా మారడానికి కారణమవుతుంది ఎండోసల్ఫాన్. కాలకూట విషం ఆమెని శారీరకంగా కృంగదీసినా, తన గాత్రంతో అమృతాన్ని కురిపిస్తుందా ధీర. భార్యభర్తల మధ్య అనురాగం లోపిస్తే, ఆ సంసారం ఎంత నిస్సారంగా ఉంటుందో ఈ కథ వివరిస్తుంది.

బేరం: ముంబైలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో గంటలు గంటలు సమయం గడిపి, అక్కర్లేని సామాన్లు అధిక ధరలకి కొనుక్కునేవారు లోకల్ ట్రైన్‌లో చేసిన ఓ చిన్న చేతి సంచీ కొనడానికి గీచిగీచి బేరాలాడుతారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెడుతూ కూరగాయలు సులువుగా తీసుకువెళ్ళగలిగే ఆ సంచీలను ఓ వృద్ధురాలు అమ్ముతూంటుంది. చివరగా ఓ మహిళ ఓ సంచి కొంటుంది. తనది అక్కర్లేని బేరం కాదనుకుంటుంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

వాళ్ళిద్దరూ, ఆటోడ్రైవరు: పుట్టబోయే ఆడపిల్ల తనకి శాపమని భావిస్తాడో మధ్యతరగతి యువకుడు. కానీ అదే ఆడపిల్ల ఓ పేద ఆటోడ్రైవర్ కుటుంబానికి వెలుగయిందని తెలుసుకున్నాక, తను తీసుకున్న నిర్ణయం మార్చుకుంటాడు. ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

అనగనగా: చిన్నప్పుడు అమ్మ దగ్గరో, నానమ్మ తాతయ్యల దగ్గరో కథలు చెప్పించుకోని పిల్లలు ఉండరు. అయితే పెద్దయ్యాక కూడా అంటే పెళ్ళయి, ఇద్దరు పిల్లల తండ్రయ్యాక కూడా అతనికి పిల్లల కథలు ఎందుకు అవసరమయ్యాయి? కఠినమైన వాస్తవ ప్రపంచాన్ని విడిచి కాసేపయినా, పిల్లలు విహరించే కల్పిత మాయాలోకంలో ఎందుకు విహరించాలనుకున్నాడతను? మనిషి జీవితాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్న ఆధునిక జీవన విధానాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందీ కథ.

నాన్నా!! తొందరగా వచ్చేయ్: నాన్న తనని ఎందుకు కొడుతుంటాడో అమిత్‌కి అర్థం కాదు. ఆటల నుంచి రావడం కొంచెం ఆలస్యమైనా తన్నులు తప్పవు. ఓ రోజు బాగా ఆలస్యం అయిపోతే, నాన్న ఇంటికి ఆలస్యంగా వస్తే బాగుండని అనుకుంటాడు అమిత్. వాడి కోరిక ఫలిస్తుంది. ఎన్నడూ లేనంతగా సుమారు నాలుగు గంటలపాటు ఆలస్యం అవుతుందా రోజు వాళ్ళ నాన్న ఇంటికి రావడానికి. తండ్రికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనన్న చిన్న అనుమానం క్షణక్షణం పెరిగిపోయి వాడి పాలిట పెనుభూతం అవుతుంది. చివరకు తండ్రి క్షేమంగా ఇంటికి చేరాక, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మలానే నాన్న కూడా తనని ప్రేమిస్తాడని గ్రహిస్తాడు. పిల్లల మనస్తత్వాన్ని, తల్లిదండ్రుల పట్ల వారిలో కలిగే భావాలని అద్భుతంగా వ్యక్తం చేస్తుందీ కథ.

అమ్రికావాలా: అమెరికా దాష్టీకానికి బలైన ఇరాకీ కుటుంబంలోని ఓ పాప కథ ఇది. యుద్ధ సైనికుల ధ్వంసరచన పూర్తయ్యాక, శాంతి నెలకొల్పే సైనిక బృందంలో ఇరాక్ వెళ్ళిన జేకబ్‌సన్ అనే అమెరికా సైనికుడి కథ ఇది. పాఠకులను అమితమైన భావోద్వేగాలకు గురిచేసే కథ ఇది. ఆ పాప తల్లిదండ్రుల ఆచూకీ దొరికితే బాగుండని ఓ పక్క; ఆచూకీ దొరక్కపోతే ఆ పాపని తనతో పాటే ఉంచుకోవచ్చన్న ఆశ – జేకబ్‌సన్ మనసులోని ద్వైదీభావం చదువరుల హృదయాన్ని బరువెక్కిస్తుంది.

ఇజంలో ఇంప్రిజన్: చదువుకునే రోజుల్లో కాపిటలిజాన్ని ద్వేషించి, సోషలిజాన్ని అమితంగా ఇష్టపడిన వ్యక్తి – చదువు పూర్తయి ఉద్యోగం చేపట్టాక కాపిటలిజాన్ని ఎందుకు ఇష్టపడ్డాడు? ఏరు దాటాక తెప్ప తగలేసే వైనాన్ని ఈ కథలో చదవచ్చు. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు మనిషి ఇజంలో ఇంప్రిజన్ అవుతాడని చెబుతుందీ కథ.

శిధిలం: అందం భౌతికమా? మానసికమా? చక్కనైన రూపం కలిగి ఉండి విపరీత ప్రవర్తన ఉన్నవారు అందంగా ఉన్నట్లేనా? తనలోని లోపాల్ని దాచుకుంటూ తనచుట్టూ ఉండేవన్నీ అత్యంత అందంగా ఉండాలని కోరుకునే ఓ మహిళ కథ ఇది. శిధిలమైన అంతరంగాన్ని అందంగా అలంకరించి, ముస్తాబు చేయాలనే నిరంతర తపన ఆమెది. కాని ఆ ప్రయత్నంలో ఆమె ఓడిపోయి, విరిగిన గుమ్మటంలా డొల్లగా కనిపిస్తుంది. ఆలోచనల్ని రేకెత్తించే కథ ఇది.

ప్లాస్టిక్ హృదయం: గ్లోబలైజేషన్ యొక్క్ మరో పార్శ్వాన్ని కొత్త కోణంలో చూపిస్తుందీ కథ. శరీరంలో కొన్ని వేల జీవకణాలతో తయారైన ఓ సజీవ అవయవాన్ని ప్లాస్టిక్‌తో మార్పిడి చేయడం సాధ్యమై, దాన్ని మార్కెట్ చేసుకోవాలని చూసే శక్తుల మాయాజాలన్ని చూపిస్తుందీ కథ. మానసికంగా దృఢంగా లేని పేద, మధ్య తరగతి వర్గాల వారిని భయపెట్టి అవయవ మార్పిడి ఎలా చేయచ్చో ఈ కథ చెబుతుంది. తన స్థానంలో ప్లాస్టిక్ గుండెని అమర్చుకోవద్దని హృదయం ఎంత మొత్తుకున్నా వినని సహృదయ్‌కుమార్ పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

ఆపరేషన్ బిర్యానీ: తమ వాటాలో వంటింటి వ్యర్ధాలను పోస్తున్న పైవాటలో కుటుంబానికి తెలివిగా బుద్ధిచెప్పిన ఓ యువజంట కథ ఇది. నగరీకరణ యొక్క దుష్పరిణామాలను వ్యంగ్యంగా, హాస్యంగా సామాజిక కోణంలో వివరిస్తుందీ కథ. చక్కని మానర్స్ ఎన్నటికీ వేస్ట్ కావు, జనాలకి కావల్సింది ‘వేస్ట్’కి సంబంధించిన మానర్స్ అని ఈ కథ చెబుతుంది.

బుద్ధిమాంద్యం: నిజంగా మానసికంగా ఎదగని వాళ్ళెవరు? మానసికంగా చిన్న లోపం ఉండి, హింసని, రక్తపాతాన్ని భరించలేని ఓ చిన్న పాపా? లేక ఎటువంటి మానసిక జాడ్యాలు లేని, వివేకవంతులైన మాములు మనుషులై ఉండి తమ మాటలపై, చర్యలపై ఏ మాత్రం అదుపులేని వారా? లేక పబ్లిక్‌లో పశుప్రవృత్తిని ప్రదర్శించేవారా? బుద్ధిమాంద్యం ఎవరిది అని ఈ కథ ప్రశ్నిస్తుంది.

వృక్షప్రేమికుడు: అక్కడి చెట్లకీ, ఇక్కడి చెట్లకీ తేడా చూపిన ఓ వ్యాపారస్తుడి కథ. స్వీయప్రయోజనాలే ముఖ్యమైన ఓ వృక్షప్రేమికుడు చెట్లనెందుకు కాపాడాలో చెప్పిన వింత భాష్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

భయం నీడ: 9/11 సంఘటన తర్వాత విమాన ప్రయాణీకుల్లోనూ, అమెరికాలో ఉంటున్న తూర్పుదేశాల ప్రజల జీవితాల్లోను చెలరేగిన భయాన్ని ప్రదర్శిస్తుందీ కథ. భద్రత పేరుతో తీసుకునే అతి జాగ్రత్తలు సామాన్య ప్రయాణీకులను ఎలా ఇబ్బందిపెడతాయో ఈ కథ చెబుతుంది. నిరంతరం భయం నీడలో బతుకుతున్నప్పుడు ఆలోచనలు సక్రమంగా ఉండవని చెబుతూ, తమ తమ చర్యలకు కారణాలు ఆపాదించుకుంటారు అధికారులు. వర్తమాన స్థితిగతులపై వ్యాఖ్య ఈ కథ.

నల్లధనం… Null ధనం: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయలేక, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో ఈ కథ చెబుతుంది. వాటి వలన సామాన్యుల జీవితాలు ఏ విధంగా పరిణమించాయో హాస్యంగా వివరించినా, భవిష్యత్తులో ఇవి నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గృహగోథికా ప్రహసనం (బల్లిదోషం): జీవితంలో హేతుబధ్ధత ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది, చిన్నచిన్న ఘటనలకు దోషాలంటూ, ఉపద్రవాలంటూ ఊదరగొట్టే పంచాగాలకూ, దోషనివారణ చర్యలకూ విరుగుడు తార్కికంగా ఆలోచించడమే అని చెప్పే కథ ఇది. మనిషిలోని విశ్వాసాలతోనూ, భయాలతోనూ మనసు ఏవిధంగా ఆటలాడుతుందో ఈ కథ వివరిస్తుంది. హాస్యంగానైనా, మనుషుల అసంబద్ధ ప్రవర్తనపై చురకలు వేస్తుందీ కథ.

ఈ కథలన్నీ ఏకబిగిన చదివింపజేస్తాయి. ఆ పై చాలాకాలం మనల్ని వెంటాడుతాయి.

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment