Home » Uncategorized » ఆలయ దర్శనం

 

ఆలయ దర్శనం

 

విషు పండగ (15ఏప్రిల్ 2010) సందర్భంగా శబరిమల వెళ్ళి శ్రీ అయ్యప్పస్వామి దర్శనం చేసుకుందామని నేను, కొంతమంది కాకినాడ మిత్రులు నిర్ణయించుకున్నాం. 1 మార్చి 2010 నాడు యుక్తరీతిలో మాల ధరించి దీక్ష ప్రారంభించాను. నలభై రోజుల దీక్ష అనంతరం మేము కాకినాడలోని అయ్యప్ప దేవాలయంలో ఇరుముడులు కట్టుకుని యాత్ర ప్రారంభించాం. ఈ యాత్రలో కేవలం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయమే కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని కొన్ని సుప్రసిద్ధ ఆలయాలని దర్శించుకున్నాం. భక్తుల కోరికలు తీరుస్తూ, అద్భుతమైన ఆధ్యాత్మక చింతనని కలిగించే ఆలయ దర్శనం విశేషాలను ఇక్కడ వివరిస్తాను.

12 ఏప్రిల్ 2010 నాటి మధ్యాహ్నం సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి, మర్నాడు ఉదయం అంటే 13 ఏప్రిల్ 2010 నాడు ఎగ్మోర్‌లో దిగాము. స్నానపానాదులు కావించి చెన్నె నగరంలోను, శివార్లలోను ఉన్న గుడులకు బయల్దేరాం.
karumariyammatemple మొదటగా చెన్నె నగరానికి పశ్చిమ దిశలో సుమారుగా 18 కి.మీ దూరంలో ఉన్న తిరువేర్కాడు కరుమారియమ్మ ఆలయానికి వెళ్ళాం. ‘తొండై మండలం’లోని 32 శైవ దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి. కరుమారియమ్మను సప్తకన్యకలలో ఒకరిగా, పార్వతీదేవి అంశగా భావిస్తారు. మొదట ఇక్కడ ఓ పెద్ద చీమల పుట్ట ఉండేదట. దాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి పూజించేవారట. తర్వాతి కాలంలో అంటే 1942-43 మధ్య కాలంలో ఆలయ నిర్మాణం జరిగి, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

karumariyammaఇక్కడి అమ్మవారు స్వయంభు. అంతే కాదు, విగ్రహంలో శిరస్సు ఒక్కటే కనబడుతుంది, మిగతా భాగం భూమిలో ఉంటుంది. మంగళ, శుక్ర, ఆదివారాలలో ఈ గుడికి భక్త జనసందోహం విపరీతంగా ఉంటుందట. అమ్మవారిని భక్తుల పాలిట కొంగుబంగారంగా వర్ణిస్తారు. ఏదైనా కోరిక కోరుకుని, అది తీరితే అమ్మవారికి వరమాల వేస్తామని భక్తులు మొక్కుకుంటారు. వరమాల అంటే వరం పొందాక, వేసే మాల! ఈ మాల పూలతోను లేదా నిమ్మకాయలతోను తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడికి, సప్తకన్యకలకు, దుర్గాదేవికి, విష్ణుమూర్తికి, నవగ్రహాలకు, దక్షిణామూర్తికి, కుమారస్వామికి ఉపాలయాలు ఉన్నాయి. మేము వెళ్ళిన సమయంలో పెద్దగా రద్దీ లేకపోడంతో అమ్మవారిని సంతృప్తిగా దర్శించుకుని ప్రసాదం తీసుకుని వెనుదిరిగాం.

SriKamakshiAmmanతర్వాత, మాంగాడులోని కామాక్షి అమ్మవారి గుడికి చేరాం. ఈ గుడి చెన్నెకి సుమారుగా 24 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పార్వతీ దేవి కామాక్షి రూపంలో పూజలందుకుంటుంది. ఒకసారి శివ పార్వతులు కైలాసంలో విహరిస్తుండగా, పార్వతీదేవి సరదాగా వెనుకనుంచి శివుడి కళ్ళు మూసిందట. పొరపాటుగా చేసిన ఆ పని వల్ల అన్ని లోకాలు అంధకారంలో కూరుకుపోయాయట. పార్వతి శివుడిని క్షమాపణ కోరగా, తీవ్రమైన తపస్సు చేసి పాప పరిహారం చేసుకోమన్నాడట. అప్పుడు పార్వతీదేవి ఇక్కడ – ఈ మాంగాడులో – పంచాగ్ని శిఖలపై నిలబడి కఠోరమైన తపసు చేసి, శివుడిని మెప్పించిందట. ఇదీ స్థల పురాణం. ఈ ఆలయంలోని మరో విశిష్టత – అతి పెద్ద శ్రీచక్రం. తపస్సు ముగిసాక, పార్వతీదేవి పంచాగ్ని శిఖల నుంచి వెలువడే మంటలను ఆర్పకుండా వెళ్ళిపోడంతో ఆ ప్రాంతమంతా విపరీతమైన వేడిమితో బాధపడింది. అప్పడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ అర్థమేరు శ్రీచక్రాన్ని ప్రతిష్టించి, మంటలని ఆర్పారట. ఈ శ్రీచక్రం వనమూలికలతో రూపొందడం వలన, అభిషేకాలు జరుపరు. కేవలం కుంకుమార్చన మాత్రమే జరుగుతుంది. ఈ ఆలయంలో వల్లీశ్వరుడికి, విష్ణువుకి ఉపాలయాలు ఉన్నాయి. సాధారణంగా ఈ గుడి ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు, ఆ తరువాత మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. మంగళ, శుక్ర, ఆదివారాలలో మాత్రం ఉదయం 5.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు ఎటువంటి విరామం లేకుండా తెరిచే ఉంటుంది. పెళ్ళి కాని అమ్మాయిలు ఇక్కడి అమ్మవారిని అర్చిస్తే, త్వరలో వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం. కోరికలు నెరవేరాక, భక్తులు ఈ గుడి చుట్టూ అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణం చేస్తారు. తమ కోరికలు తీరిన భక్తులు దర్శనానికి వచ్చిన ఇతర భక్తులకు పాలు, పాయసం ప్రసాదంగా పంచుతారు. మేము అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగాం.

parthasarathytemple తర్వాత, చెన్నె సెంట్రల్ స్టేషన్‌కి సుమారుగా నాలుగు కి.మీ దూరంలో ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారథి గుడికి వెళ్ళాం. ఈ గుడి విశిష్టత ఏమిటంటే కృష్ణుడు వెంకటేశ్వరుని రూపంలో దర్శనమీయడం. దేశంలోని 108 సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఇదొకటి. సుమతి అనే భక్తుని కోరిక మేరకు వేంకటేశ్వరుడు పార్థసారథి రూపంలో దర్శనమిస్తాడట. అగస్త్య ముని ఈ ఇక్కడ ఆ మూర్తిని వెంకట కృష్ణుడి రూపంలో ప్రతిష్టించారట. రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి సంతానం కోసం ప్రార్ధించిన పిదప శ్రీ రామానుజార్యుల వారు జన్మించారట.
Parthasarathy_swamy
ఇక్కడి విగ్రహంలో స్వామి వారు అభయ హస్తం, వరద హస్తం కలిగి ఉంటారు. సుదర్శన చక్రం ఉండదు, కుడి చేతిపై (అభయహస్తం) శంఖం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే, కురుక్షేత్ర సంగ్రామ సమయంలో తాను ఆయుధం చేపట్టనని కృష్ణ భగవానుడు మాటిచ్చాడు. ఈ విగ్రహానికి శౌర్యానికి చిహ్నంగా మీసం ఉంటుంది. ఇక్కడ కృష్ణుడితో పాటు, రుక్మిణి, బలరాముడు, సాత్యకి, అనిరుద్ధుడు, నరసింహస్వామి పూజలందుకుంటారు. అద్భుతమైన దక్షిణ భారత నిర్మాణ శైలితో కూడిన గోపురాలు, మండపాలతో ఈ గుడి నేత్రానందం కలిగిస్తుంది. ఎంతటి పిరికివారైనా ఈ గుడికి వచ్చి వెంకట కృష్ణుడిని దర్శించుకుంటే, అన్ని భయాలు నశించి ధైర్యం పొందుతారని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రసాదంగా లభించే చక్కెరపొంగలి, పులిహోర, దద్దోజనం రుచి అమోఘం. తినవనల్సిందే కాని రుచిని వర్ణించలేము. ఉదయం 5.30 గంటలకి ప్రారంభమయ్యే పూజాదికాలు రాత్రి 9.00 గంటలకు ముగుస్తాయి.
ఇక్కడ దర్శనమయ్యాక మేము అడయార్‌లోని అయ్యప్ప దేవాలయాన్ని దర్శించాము. మా బృందంలో ఆలస్యంగా చేరిన ఓ స్వామికి ఇక్కడ ఇరుముడి కట్టించాము.
kapaleswarar temple
ఆ తరువాత, మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయాన్ని సందర్శించాము. దక్షిణ భారత దేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయలలో ఇదొకటని అంటారు. ఓ సారి బ్రహ్మదేవుడు శివపార్వతుల పట్ల అలక్ష్యంగా వ్యవహరించాడని శివుడు బ్రహ్మ అయిదు శిరస్సులలో ఒక దానిని ఖండించివేసాడట. పాప పరిహారార్థంగా బ్రహ్మ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడట. శివుడు ఆ కపాలాన్ని పట్టుకుని నిలబడి ఉంటాడట. యుగప్రళయం సందర్భంగా సర్వం లయం కాగా, శివుడు ఈ కపాలం నుంచే సృష్టిని ప్రారంభిస్తాడట. ఈ గుడికి నలువైపులా నాలుగు మాడవీధులు ఉన్నాయి. గుడికెదురుగా చక్కని కోనేరు ఉంది. గుడి బయట ఉన్న విశాలమైన ప్రాంగణంలో సంగీత సభలు, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి విశిష్టత ఏంటంటే గురువు దగ్గర నేర్చుకున్న పాఠాలను శిష్యులు తొలిసారిగా ఇక్కడే ప్రదర్శిస్తారు. దర్శనానంతరం భోజనాలు చేసి మధ్యాహ్నం మూడున్నర – నాలుగు గంటల మధ్యలో తిరువనంతపురం వెళ్ళే రైలు ఎక్కాం.
chotanikkarabhagavatitemple
మర్నాడు అంటే 14 ఏప్రిల్ 2010 తెల్లవారు జామున 2.50 నిముషాలకి ఎర్నాకుళంలో దిగాం. అక్కడి 17 కి.మీ దూరంలోని చోటా నిక్కర చేరి, స్నానాదులు పూర్తిచేసాం. ఇక్కడి మూల విరాటు రాజరాజేశ్వరి దేవి. అమ్మవారిని భగవతి అని పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయం నుంచి తెచ్చారని, అందుకే అమ్మవారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల వరకు మూకాంబికలా (సరస్వతి దేవిలా) దర్శనమిస్తుందట. మధ్యాహ్నం వరకు లక్ష్మీదేవిలా, సాయంత్రం నుంచి రాత్రి వరకు దుర్గాదేవిలా దర్శనమిస్తుంది.
chbagavaty
అమ్మవారి విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి. కుడి పై చేతిలో చక్రం, ఎడమ పై చేతిలో శంఖం ఉంటాయి. కుడి చేయి వరద హస్తం, ఎడమ చేయి అభయ హస్తం. ఇదే పీఠం మీద విష్ణుమూర్తి కూడా ఉంటాడు. మాతని, స్వామిని కలిపి ‘అమ్మే నారాయణ, దేవీ నారాయణ, భద్రే నారాయణ అని వ్యవహరిస్తుంటారు. ఇక్కడ బ్రహ్మకి, శివుడికి, వినాయకుడికి, సుబ్రహ్మణ్యస్వామికి, అయ్యప్పకి ఉపాలయాలు ఉన్నాయి. మేము దర్శనానికి క్యూలో నిలుచున్న సమయంలోనే అమ్మవారిని ఏనుగుపై గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయించారు. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా పూలు, గంథం ఇస్తారు. రాక్షస గణాల నుంచి, భూతప్రేతపిశాచ గణాలనుంచి భక్తులను అమ్మవారు రక్షిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలోని రక్షరేకులను స్త్రీలు ధరిస్తే, ఏ కీడు జరగదని నమ్మకం. ఇక్కడి అమ్మవారు మానసిక ఆందోళనని దూరం చేసి ప్రశాంతతని కల్పిస్తుందని ప్రతీతి.

malliyoortemple
తరువాత మేము కొట్టాయం జిల్లాలోని మల్లీయూర్‌లోని మహాగణపతి ఆలయానికి వెళ్ళాం. ఈ గుడి విశిష్టత ఏమిటంటే వినాయక ఆలయంలో వైష్ణవ తత్వాన్ని మిళితం చేయడం.
malliyoorganapathy
ఇక్కడ వినాయకుడి ఒడిలో బాల కృష్ణుడు ఉంటాడు. ఇక్కడి వినాయకుడు బీజ గణపతి. తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది, తొండం మొనపై నిమ్మకాయ ఉంటుంది. కర్మబంధాల నుంచి విముక్తి పొందేందుకు, కలియుగంలోని సకల దోషాల నుంచి పరిహారం పొందేందుకు ఈ గుడిని ఎంతో మంది భక్తులు దర్శిస్తారు. ఈ గుడికున్న మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ జరిగే గణపతి హోమం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ గణపతి హోమం చేయించడానికి రుసుం దాదాపు లక్ష రూపాయలని, అయినా 2021 వరకు ఖాళీ లేదని వినికిడి.

తర్వాత మేము వైకం అనే ఊరు చేరాం. వైకం, ఎట్టుమానూరు, కడత్తురతి అనే మూడు ఊర్లు ఒక దానికి మరొకటి సుమారుగా 15 కి.మీ దూరంలో ఉంటాయి. ఈ మూడు చోట్ల మూడు శివాలయాలు ఉన్నాయి. పురాణ గాథ ప్రకారం రామాయణ కాలం నాటి ఖరదూషణులలో ఒకరైన ఖరుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి, శివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. వరంగా శివుడి ఆత్మలింగాన్ని కోరాడు. తన ఆత్మలింగాన్ని ఇది వరకే రావణుడికి ఇచ్చేసానని, అది గోకర్ణంలో ప్రతిష్టించబడిందని శివుడు చెబుతాడు. అయితే, తన ఆత్మలింగంతో సమానమైన మూడు లింగాలని ఇస్తానని, ఆ మూడింటిని ఏక కాలంలో సమాన దూరంలో ప్రతిష్టించాలని చెబుతాడు. ఖరుడు తన రాక్షస మాయ చేత శరీరాన్ని పెంచి కుడి చేతిలో ఒక లింగాన్ని, ఎడమ చేతిలో మరో లింగాన్ని, కంఠ భాగంలో మరో లింగాన్ని ఉంచుకుని ఒక్కో దానికి మధ్య సుమారుగా 15 కి.మీ ఉండేడట్లుగా ప్రతిష్టించాడట. కుడి చేతిలోని లింగం ప్రతిష్టించిన ప్రదేశం వైకం అని, ఎడమ చేతిలోని లింగాన్ని ప్రతిష్టించిన ప్రాంతం ఎట్టుమానూరు అని, కంఠభాగంలోని లింగాన్ని ప్రతిష్టించిన ప్రాంతం కడత్తురతి అని పేర్గాంచాయి.
vikomsivatempleవైకం మహాదేవ క్షేత్రం దక్షిణ కాశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని, ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఆలయం పూజలు నిరంతరాయంగా జరుగుతున్నాయని ప్రతీతి. ఈ గుడిలో భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. vikomsivaశివుడు ఇక్కడ ఉదయం పూట దక్షిణామూర్తి రూపంలోను, మధ్యాహ్నం కిరాతమూర్తిగాను, సాయంత్రం జగత్పిత అయిన పరమశివుడిగాను దర్శనమిస్తారు. స్వామి దక్షిణామూర్తి రూపంలో ఉన్నప్పుడు భక్తులకు జ్ఞానవైరాగ్యాలను, సదవగాహనని; కిరాతమూర్తి రూపంలో ఉన్నప్పుడు భక్తులకు సర్వకార్య జయాన్ని, సర్వ విఘ్నోపశాంతిని; పరమశివుడి రూపంలో ఉన్నప్పుడు భౌతిక సౌభాగ్యాలని ప్రసాదించి భక్తులు కోరుకునే కోరికలని తీరుస్తాడు. ఇక్కడ అమ్మవారికి, వినాయకుడికి, నాగరాజుకి ఉపాలయాలు ఉన్నాయి. భక్తులకు అత్యంత ప్రశాంతతని కలిగిస్తుందీ ఆలయం.

ettumanoortemple
కొట్టాయంకు ఉత్తర దిశగా సుమారు 12 కి.మీ దూరంలో ఎట్టుమానూరు ఉంది. ఇక్కడి మహాదేవ ఆలయంలోని భిత్తిచిత్రాలు అద్భుతమైనవి. వివిధ పురాణాలలోని ఘటనలను వివరిస్తాయి. దారుశిల్పాలతోను, మండపాలతోను ఉన్న ఈ గుడి నిర్మాణశైలి అచ్చెరువొందిస్తుంది. ప్రాచీనమైన ఈ గుడిని 1542లో పునర్నిర్మించారు. గుడిలోకి ప్రవేశిస్తుండగా అతి పెద్ద దీపం కుందు కనిపిస్తుంది. ఇందులో దీపం ఎప్పుడూ వెలుగుతునే ఉండాలని భక్తులు నూనె పోస్తునే ఉంటారు. ఈ గుడిలో పార్వతీ దేవికి, వినాయకుడికి, అయ్యప్పకి, దక్షిణామూర్తికి ఉపాలయాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారు ‘సౌందర్యలహరి’ని ఇక్కడే రచించారని ప్రతీతి. ఈ గుడి పశ్చిమ ద్వారంలోని కుడ్య చిత్రాలలో నాట్యం చేస్తున్న శివుడి చిత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ettumanur

Kaduthuruthy-Mahadeva-Templeఇక్కడి నుంచి మేము కడత్తురతి మహాదేవ క్షేత్రం చేరాం. ఈ గుడి చిన్న కొండపై ఉంటుంది. ఇక్కడి శివలింగం సుమారుగా మూడు అంగుళాలు మాత్రమే ఉండి తూర్పు దిశగా ఉంటుంది. ఈ గుడి నిర్మాణ శైలి చాలా చక్కగా ఉంటుంది. గోపురం పై కప్పు మీద ఎన్నో రంగురంగుల చిత్రాలు ఉంటాయి. దారుశిల్పాలు ఉంటాయి. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ గుడి అగ్ని ప్రమాదానికి గురైతే అప్పటి ప్రధాన పూజారి శివలింగానికి ఏమీ కాకూడదని, లింగాన్ని గట్టిగా కౌగిలించుకుని అగ్నికి తనని ఆహుతి చేసుకున్నాడట. ఆయన స్మతి చిహ్నం ఈ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ మూడు లింగాలని ఒకే రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల చూసేవారికి జన్మరాహిత్యం కలుగుతుందని శివుడు వరమిచ్చాడట. అదృష్టవశాత్తు మేము మూడు లింగాలను రెండు గంటల వ్యవధిలోనే దర్శించుకోగలిగాం.

తరువాత మేము ఎరుమేలి చేరి పేటతుళ్ళి ఆడి, అక్కడి నుంచి పంబ, అప్పాచీమేడు, నీలమల, శరంగుత్తి మీదుగా శబరిమల చేరాం. స్వామి దర్శనం చేసుకుని రాత్రికి విశ్రమించాం. మర్నాడు విషు పండగ నాడు అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకాలు చేయించాం. తంత్రిగారు ప్రసాదంగా ఇచ్చే రూపాయ నాణాలను తీసుకున్నాం. వారు పూజించి ఇచ్చిన ఆ నాణాన్ని మన డబ్బు సంచీలోగాని, బీరువాలో గాని ఉంచితే సంపద అక్షయంగా ఉంటుందని విశ్వాసం. తరువాత మేము తీసుకువెళ్ళిన పదార్ధాలతో వంట వండి సుమారుగా 150 మంది భక్తులకు అన్నదానం చేసాం. పిమ్మట మాలికాపురత్తమ్మ వారిని సందర్శించుకుని, పంబకి చేరాం. అక్కడి నుంచి మా తిరుగు ప్రయాణం మొదలైంది.
Ambalappuzha_Sri_Krishna_Templeరాత్రి 10 గంటల సమయంలో అంబరపుళ అనే ఊరు చేరి అక్కడి సుప్రసిద్ధ బాల కృష్ణుడి గుడి మండపంలో విశ్రమించాం. మర్నాడు దేహవిధులు కానించి స్వామి దర్శనం చేసుకున్నాం. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. క్రీ.శ. 790 సంవత్సరంలో అప్పటి స్థానిక పాలకుడు తిరునాళ్ దేవనారాయణ తంపూర్ ఈ గుడిని నిర్మించాడు. ఈ గుడికి, గురువాయూర్‌లోని కృష్ణుడి ఆలయానికి దగ్గరి సంబంధం ఉంది. 1789లో టిప్పూ సుల్తాన్ దాడులకు వెరచి గురువాయూర్‌లోని కృష్ణుడి విగ్రహాన్ని ఈ గుడిలో భద్రపరిచారు. ఈ గుడిలో ప్రసాదంగా పాయసం పెడతారు. ఈ ప్రసాదం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అప్పటి రాజుకి చదరంగమంటే బాగా ఇష్టంట. ఓ సారి కృష్ణుడు ఓ సాధువు రూపంలో వచ్చి చదరంగం ఆడదామని రాజుని ఆహ్వానించాడట. ఆటకి ముందు పందెంగా ఏం కావాలో అడగమన్నాడట రాజు. ‘నేను సర్వసంగ పరిత్యాగిని, నీవిచ్చే భౌతిక సంపదలు నాకెందుకు? అయిన అడిగావు కాబట్టి నాకు కొన్ని బియ్యం గింజలు ఇవ్వు చాలు’ అని అన్నాడట సాధువు. ఆట ప్రారంభమైంది, రాజుగారు ఓడిపోయారు. సాధువు చదరంగం మొదటి గడిలో ఒక గింజ, తర్వాతి గడిలో దానికి రెట్టింపు గింజలు, ఆ తర్వాతి గడిలో దానికి రెట్టింపు గింజలు ఉంచమని అడిగాడట. రాజుగారు అంతేనా అనుకుంటూ ధాన్యాగారం నుంచి బియ్యం తెప్పించాడట. కాని కృష్ణుడి మహిమ వలన మొదటి గడిలో ఉంచిన బియ్యం గింజే అనంతమైపోయిందట… రాజు గారి ధాన్యాగారం ఖాళీ అయినా, చదరంగం గడులు నిండలేదట. అప్పటికి గాని రాజు తనని పరీక్షించడానికి వచ్చింది దేవదేవుడు తప్ప మరొకరు కాదని గ్రహించలేకపోయాడు. తన తప్పుని మన్నించమని వేడి శరణుకోరాడు. అప్పుడు కృష్ణుడు ‘ఇప్పటికిప్పుడు నువ్వు నీ పందెం చెల్లించనక్కర్లేదు. నిత్యం కొంత మేర చెల్లిస్తూ ఉండచ్చు’ అని చెప్పాడు. అందుకే ఇప్పటికీ ఈ గుడిలో బియ్యం పాయసం చేసి భక్తులకు ఉచితంగా పంచుతారు.
తరువాత మేము కొడన్‌గల్లూర్ లోని భగవతి అమ్మవారి గుడికి చేరాం. ఇది గురువాయూర్‌కి సుమారుగా 45 కిమీ దూరంలో ఉంది. ఇక్కడి అమ్మవారు దుష్టశక్తులను నాశనం చేసి తమను రక్షిస్తుందని భక్తుల విశ్వాసం. దర్శనమయ్యాక కాఫీ తాగి గురువాయూర్‌కి పయనమయ్యాం.

guruvayurtemple కేరళ సాంస్కృతిక రాజధానైన త్రిస్సూర్‌కి సుమారుగా 29 కి.మీ దూరంలో ఉంది గురువాయూరు. ఇక్కడి కృష్ణుడి గుడి అత్యంత సుప్రసిద్ధమైన దేవాలయం. ఈ గుడిలో కేవలం హిందువులకే ప్రవేశం ఉంటుంది. కృష్ణుడు అవతారం చాలించాక, ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అయితే ఒక్క కృష్ణుడి విగ్రహం మాత్రం సముద్రంలో తేలుతూ ఉంటే, దేవగురువు బృహస్పతి సలహాపై వాయుదేవుడి ఆ విగ్రహాన్ని సంరక్షించి, పరుశురాముడి వినతి మేరకు ఇక్కడ ప్రతిష్టించాడు. గురువు, వాయువు స్థాపించిన క్షేత్రం కాబట్టి గురువాయూరు అని పేరొచ్చింది. అలాగే ఈ గుడిని దక్షిణ ద్వారకగా వ్యవహరిస్తారు.

guruvayur krishna guruvayoorbalakrishna ఇక్కడి విగ్రహంలో కృష్ణుడు నాలుగు చేతులు కలిగి ఉండి, పైన కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో శంఖం ధరించి ఉంటాడు. క్రింది కుడి చేతిలో గధని, ఎడమ చేతిలో పుష్పాన్ని కలిగి ఉంటాడు. అలాగే, గోచీ కట్టుకుని ఉండే బాలకృష్ణుని రూపం ముగ్ధమనోహరంగా ఉంటుంది. సంతానం కలగని దంపతులకు బాలకృష్ణుడి గోచీని (శేష వస్త్రాన్ని) కానుకగా ఇస్తే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం. ఇక్కడ దేవుడికి పాల పాయసం, నెయ్యి పాయసం, అప్పం ప్రసాదంగా నివేదిస్తారు. రాత్రి గుడి మూసేసే ముందుగా నైవేద్యం పెట్టిన నెయ్యిని భక్తులకు ప్రసాదంలా చేతిపై కొంచెం కొంచెం అద్దుతారు. ఆ నెయ్యి వాసన మూడు నాలుగు రోజుల పాటు ఉంటుంది. కృష్ణుడి ఆలయం బయటి గోడలపై రంగురంగుల చిత్రాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలో అమ్మవారు, అయ్యప్ప, గణపతి కొలువై ఉన్నారు. ఆలయ ప్రవేశానికి కఠిన నియమాలను అమలు చేస్తారు. మగవారు చొక్కా, పాంటు, లుంగీ, బనీను ధరించరాదు. పంచతోనే ఆలయంలో ప్రవేశించాలి. తప్పని సరిగా చూసి తీరాల్సిన ఆలయమిది.

vadakkumnathan_templeతదుపరి త్రిస్సూర్ చేరాం. కేరళలో కెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం త్రిస్సూర్‌లోని వడకంనాథ స్వామి దేవాలయం. కేరళ నిర్మాణ శైలి కలిగి ఉన్న ఈ గుడి ఆలయం కుడ్యాలపై రంగురంగుల చిత్రాలు, పై కప్పుకి అలంకరించిన వర్ణచిత్రాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసమని, వృషభాచలమనే పేర్లు ఉన్నాయి. పురాణ గాథల ప్రకారం ఈ గుడిని పరశురాముడు నిర్మించాడు. ఇక్కడి శివలింగం భక్తులకు గోచరించదు. సంవత్సరాల తరబడి నిరంతరం జరిగే నెయ్యాభిషేకం కారణంగా శివలింగంపై దట్టంగా నెయ్యి పేరుకు పోయింది. 10 అడుగుల మేర నెయ్యి దిబ్బలా కనిపిస్తుంది. శ్వేతవర్ణంలోని ఈ స్వచ్ఛమైన నెయ్యి కారణంగా గర్భగుడి మంచుతో నిండిన కైలాసంలా అనిపిస్తుంది. అతి పెద్ద రాతి ప్రాకారం కలిగిన (36,000 చ.మీ వైశాల్యం) ఈ గుడిలో పార్వతి దేవి, గణేశుడు, రాముడు, శంకరనారాయణ, కృష్ణుడు, వృషభేశ్వరుడు, అయ్యప్ప, సింహోదరుడు వంటి దేవతలకే కాకుండా, పరశురాముడు, ఆదిశంకరులకు కూడా ఆలయాలు ఉన్నాయి. హైందవేతరులకు ఈ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం.

ఈ ఆలయానికి సంబంధించి మరోక గాథ ఉంది. ఆదిశంకరాచార్యుల తల్లిదండ్రులు శివగురువు, ఆర్యాంబలు సంతానార్ధులై శివుని పూజించగా, పరమశివుడు ప్రత్యక్షమై చిరాయువుగా జీవించే మూర్ఖుడు కొడుకుగా కావాలా లేక అల్పాయువైనా జ్ఞానైన కొడుకు కావాలా అని అడుగుతాడు. వారు జ్ఞానినే కోరుకుంటారు. ఈశ్వర ప్రసాదంగా జన్మించిన పుత్రుడికి శంకరుడనే పేరు పెట్టుకున్నారా దంపతులు. పెళ్ళై చాలా కాలమైనా పిల్లలు పుట్టకపోతే, ఈ ఆలయాన్ని దర్శించి శివుడిని ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే, ఈ గుడికి మరో విశిష్టత కూడా ఉంది. ఏప్రిల్-మేలో జరిగే ‘త్రిస్సూర్ పూరం’ అనే వార్షిక ఉత్సవానికి ఈ గుడి వేదిక. అందరు దేవుళ్ళకు నమస్కరించుకుని, ఆలయ నిర్మాణాన్ని, లోపలి దారుశిల్పాలని, కుడ్యచిత్రాలను మెచ్చుకుంటూ వెనుదిరిగాం.
Thiruvambadi_Sri-Krishna_Temple
అక్కడి నుంచి తిరువంబాడి కృష్ణుడి గుడికి వెళ్ళాం. ఇది వడకంనాథ స్వామి గుడికి సుమారుగా ఓ కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడ బాలకృష్ణుడి విగ్రహం రమణీయంగా ఉంది. ఇక్కడ కూడా స్వామి గోచీలోనే దర్శనమిస్తారు. ఇదే గుడిలో కాళికా దేవి విగ్రహం కూడా ఉంది. ఈ గుడిలో వినాయకుడు అయ్యప్ప కూడా పూజలందుకుంటారు. కృష్ణుడు, దేవి ఈ గుడికి రావడానికి ఓ కథ ఉంది. నిజానికి ఇప్పుడు ఇక్కడ పూజలందుకుంటున్న కృష్ణుడి విగ్రహం మొదట్లో పార్థసారథి రూపంలో త్రిస్సూర్‌కి పదిహేను కి.మీ. దూరంలో ఉన్న ఎడక్కలతూర్ అనే ఓ కుగ్రామంలోని గుడిలో ఉండేదట. ఒకసారి ఆ గ్రామంలో మత ఘర్ఘణలు చెలరేగగా, కొంతమంది భక్తులు ఈ విగ్రహాన్ని తీసుకుని త్రిస్సూర్ చేరి ప్రస్తుత ఆలయానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ‘కంచనప్పిలి ఇళ్ళం’లో నివాసముంటున్న ఓ సదాచార నంబూద్రి కుటుంబానికి అప్పగించారట. నిస్సంతులైన ఆ దంపతులు దీన్ని భగవంతుడి వరంగా భావించి, ఆ విగ్రహాన్ని తమకు పుట్టబోయే బిడ్డగా అనుకుని పూజించారట. దయాళువైన స్వామి తన భక్తుల ఆరాటం తీర్చడానికి పార్ధసారథి పట్టునుంచి బయట పడి ఓ చేత్తో వేణువు, మరో చేత్తో తన పెంపుడు తల్లిదండ్రులందించే వెన్నముద్దలను స్వీకరిస్తున్నట్లుగా ఆకారం దాల్చాడట. తరువాతే గుడి నిర్మాణం జరిగింది. thiruvambadibalakrishna
ఇక ఈ గుడిలోకి అమ్మవారు రావడానికి మరో కథ ఉంది. ఈ దంపతులలోని భర్తకి కొడన్‌గల్లూర్‌లోని అమ్మవారి పట్ల భక్తి. వీలైనప్పుడల్లా అక్కడి వెళ్ళి అమ్మవారిని దర్శించి తిరిగి వస్తుండేవాడట. వయసు పైబడి అక్కడి వెళ్ళలేకపోతే, ఆర్తితో అమ్మవారిని ప్రార్థించాడట. అమ్మవారి అంశ ఒకటి ఇక్కడి వచ్చి ఈ గుడిలోనే స్థిరపడిందట. కృష్ణుడితో పాటు, దేవిది కూడ బాల రూపమే. బలభద్రకాళి అనే పేరుతో పిలుస్తారు. దర్శనాలయ్యాక, ఇక్కడికి దగ్గరలోని పరమెక్కావు అమ్మవారి గుడికి వెళ్ళాం.

paramekkavau temple
పరమెక్కావు అమ్మవారి విగ్రహం కేరళలోని అన్ని అమ్మవారి విగ్రహాల కన్నా పెద్దది. పురాణాల ప్రకారం మొదట పరమెక్కావు అమ్మవారు వడకంనాథ స్వామి వారి గుడిలో ఉండేవారని, భక్తులు వడకంనాథ స్వామి ఆలయాన్ని విశాలం చేయడం కోసం, అమ్మవారిని శివుని పుత్రికగా భావించి, ఆమెని ప్రస్తుతం ఉన్న గుడిలో స్థాపించారని ప్రతీతి. ఈమె అక్క కాళికా రూపంలో తిరువంబాడి కృష్ణుడి గుడిలో కొలువై ఉంది. ప్రతీ ఏడాదీ జరిగే పూరం ఉత్సవంలో ఈ అక్కచెళ్ళెళ్ళిద్దరూ పోటీపడతారని భక్తుల నమ్మకం. ఈ గుడిలో అమ్మవారి దర్శనమయ్యే సరికి మేము చెన్నై చేరేందుకు రైలందుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

రైల్వే స్టేషన్‌లోనే పలహారాలు కానిచ్చి బండి రాగానే, ఎక్కి హాయిగా నిద్రపోయాం. మర్నాడు ఉదయం అంటే 17 ఏప్రిల్ 2010 నాడు సుమారుగా 7 గంటలకి చెన్నై చేరాం. అక్కడి నుంచి విజయవాడ మీదుగా నేను హైదరాబాదుకి, రాజమండ్రి మీదుగా మా మిత్రులు కాకినాడ చేరాము. ఇంట్లో స్వామి పీఠానికి నమస్కరించుకుని, దీక్ష విరమణ చేసాను. మళ్ళీ సాంసారిక జీవనంలోకి వచ్చేసినా, చాలా రోజుల పాటు నేను దర్శించిన ఆలయాల దృశ్యాలు నా కళ్ళముందు కదలాడుతునే ఉన్నాయి. అందుకే ఈ గుడుల గురించి మరిన్ని వివరాలు సేకరించి పాఠకులతో పంచుకోవాలనుకున్నాను. ఈ ఆలయాలకి సంబంధించిన వివరాలను, వాటి ప్రాశస్త్యాన్ని నాకు వివరించిన మా గురుస్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ ఆలయాలకి సంబంధించిన అదనపు సమాచారం, ఫోటోలు ఆయా దేవాలయాల వెబ్‌సైట్లనుంచి సేకరించాను. వారికి కూడా నా ధన్యవాదాలు.
సర్వేజనా సుఖినో భవంతు

 

2 Comments

  1. Soma Sankar says:

    ఈ వ్యాసం సుమారుగా మూడేళ్ళ క్రితం రాసి, ఓ మ్యాగజైన్‌కి పంపాను. వారిప్పటిదాకా….. ఏ నిర్ణయమూ తెలపకపోయే సరికి, చివరికి నా బ్లాగులో ప్రచురించుకున్నాను.

  2. Srinivas says:

    శబరిమలై యాత్ర గురించి చక్కగా వివరించారు ..

Leave a Reply to Srinivas