Home » Book Intro » “ప్రయాణానికే జీవితం” గురించి అనువాదకుడి మాటలు

 

“ప్రయాణానికే జీవితం” గురించి అనువాదకుడి మాటలు

 

image descriptionఎవరైనా ఒక చోటు నుంచి మరో చోటుకి ఎందుకు వెడతారు? యాత్ర అనండి, పర్యటన అనండి లేదా దేశాటనం అనండి…. పేరేదైనా దాని ఉద్దేశం కొత్త మనుషుల్ని, కొత్త ప్రాంతాల్ని, కొత్త విషయాలని తెలుసుకోవడమే. అలాగే యాత్రికుడు తనని తాను తెలుసుకోడం కూడా. దేశంలోని ఇతర ప్రాంతాల వ్యక్తుల జీవితాలు, భిన్న సంస్కృతులు, జీవనవిధానాలు తెలుసుకుంటూ సాగేది భౌతికయాత్ర అయితే, యాత్రాకాలంలో సంభవించే కష్టనష్టాలను తట్టుకుంటూ తనలోకి తాను ప్రయాణిస్తాడు పథికుడు. ప్రయాణాలు జ్ఞానాన్ని పెంచుతాయి. తన చుట్టూ ఉండే పరిస్థితులపై అవగాహననూ, తనంటే ఏమిటో గ్రహించగలిగే అవకాశాన్ని కల్పిస్తాయి.
ఇదే లక్ష్యంతో పూనె నుంచి జమ్మూ వరకు ఒంటరి ప్రయాణం తలపెట్టారు డా. అజిత్ హరిసింఘాని. పూనె నుంచి బయల్దేరి దహనూ, అహ్మదాబాద్, మౌంట్ ఆబూ, జైపూర్, న్యూఢిల్లీ, కిరాత్‌పూర్, కసోల్, మనాలి, దార్చా, పాంగ్, లేహ్, హుందర్, లేహ్, కార్గిల్, ద్రాస్, శ్రీనగర్, పటనీటాప్ మీదుగా జమ్మూ ప్రయాణం…. అదీ ఒంటరిగా! రాయల్ ఎన్‌ఫీల్డ్ పైన!!
ప్రయాణం చేస్తూ, కొత్తవాళ్ళని కలుసుకుంటూ, అక్కడి కాలమాన పరిస్థితులను గమనిస్తూ స్థానికుల ఆచార వ్యవహారాలను, స్థితిగతులను గుర్తిస్తూ గమనిస్తూ; పట్టణవాసులకూ, గ్రామీణులకూ; నగరాలకు గ్రామాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను, వైరుధ్యాలను ప్రస్తావిస్తూ మనకు అసలైన భారతదేశాన్ని పరిచయం చేస్తారు రచయిత. పేదరికం, లేమి ఎంతలా ఉన్నా చాలామంది భారతీయులు ఎంత ఆనందంగా ఉంటారో చెబుతారు. ఇంట్లో లభించే సౌఖ్యాలు, సౌకర్యాలు ప్రయాణం చేస్తున్నప్పుడు లభించవు కాబట్టి వాటి విలువ గ్రహించేందుకు అప్పుడప్పుడూ ప్రయాణాలు చేయాలని సూచిస్తారు.
ఆహ్లాదకరంగా మొదలై, ఊర్లు దాటుతున్న కొద్దీ తను గమనిస్తున్న మార్పులన్నింటినీ మనకు వివరిస్తారు. పూనె శివార్లలో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, దహానులో సముద్రం ఒడ్డున కల్లు దుకాణం, నడమంత్రపు సిరితో దాష్టీకం చేసే వ్యక్తులు, సైకిల్ పై మక్కా వెళ్ళదలచిన సూఫీ సాధువు, మాయమాటలు చెప్పి యజ్ఞయాగాదులు జరిపించి మేలు చేస్తామని భ్రమింపజేసే నకీలీ బాబాలు, న్యూఢిల్లీ ఎండలు, ఆకలి తీర్చే గురుద్వారా, అలసిన మనసుకి సాంత్వన కలిగించే షాబాద్ గీతం, ప్రశాంతమైన సూరజ్‌ తాల్ సరస్సు, ఉన్నత హిమాలయాలు, నడి రోడ్డు నది, హెమిస్ ఉత్సవం…. ఇలా ఆనందకరమైన అనుభూతుల నుంచి క్రమక్రమంగా కఠినమైన వాస్తవాలవైపు నడుపుతారు రచయిత.
కల్లోల కాశ్మీరం! ప్రజలలో అభద్రత… భయం. వెర్రితలలు వేస్తున్న వేర్పాటువాదం! సైనికులలో ఇంటి బెంగ! భద్రతాదళాలకు తీవ్రవాదులకు మధ్య నిరంతర పోరాటం…. క్షణభంగురమైన జీవితాలు…! ఒకప్పుడు స్వర్గధామంలా ఉన్న కాశ్మీరం ఇప్పుడెందుకు ఇలా అయిపోయింది? మనం మన ఊళ్ళల్లో… ఇళ్ళల్లో హాయిగా ఉండగలుగుతున్నామంటే అందుకు కారణం సరిహద్దుల్లో ఉన్న జవానులేనని, వాళ్ళ త్యాగాల వల్లనే మనం సుఖంగా ఉండగలుగుతున్నామని మరోసారి గుర్తు చేస్తారు రచయిత.
రచయిత తిరుగు ప్రయాణం రైల్లో! 4300 కిలోమీటర్లకు పైగా జరిగిన ప్రయాణంలో రచయితకెదురైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి గురించి తెలుసుకుంటే బాధ్యతారాహిత్యం ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో తెలుస్తుంది.
యాత్ర ఎలా చేసినా, దాని ముఖ్య ఉద్దేశం జీవితాన్ని పునరుత్తేజితం చేసుకోడమే. ఈ క్రమంలో తాను స్వయంగా రిఫ్రెష్ అయి, పాఠకులని కూడా తన బైక్ వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని తిప్పిన అనుభూతిని కలిగిస్తూ వారికీ మనోల్లాసాన్ని కలిగిస్తారు రచయిత.
మరి ఆలస్యం ఎందుకు?
చదవండి “ప్రయాణానికే జీవితం”
http://kinige.com/book/Prayananike+Jeevitam

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment