Home » Book Intro » మొదటి తరం రాయలసీమ కథలు

 

మొదటి తరం రాయలసీమ కథలు

 

Modati Taram Rayalaseema Kathalu Cover
ఈ పుస్తకం అత్యంత విలువైనది. ఏ అకాడమీలో, విశ్వవిద్యాలయాలో, సాంస్కృతిక శాఖో ప్రచురించవలసిన పుస్తకం ఇది. కానీ అటువంటి పరిస్థితి లేనందువల్ల డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ పూనుకుని ఈ పుస్తకాన్ని అబ్జ క్రియేషన్స్‌ ద్వారా ప్రచురించారు.
క్రీ.శ.1882 – 1944ల మధ్య జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధనపత్రిక, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త మొదలైన పత్రికలలో ప్రచురితమైన కథల నుండి సేకరించిన 42 కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో కథాలక్షణాలను వివరించే ఒక వ్యాసాన్ని (”చిన్న కథలు”) అనుబంధంగా ఇచ్చారు. హెచ్.నంజుండరావు వ్రాసిన ఈ వ్యాసం 1927 జనవరి 15వ తేదీ శ్రీ సాధనపత్రిక నుండి సేకరించారు. విలువైన వ్యాసం ఇది.
శీర్షికలో రాయలసీమ కథలు అని ఉన్నా ఈ కథలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనవి కావు. చాలా కథల్లోని ఇతివృత్తాలు విశ్వజనీనమైనవి. చాలా కథలలో గ్రాంథికం ఉన్నా, ఈ నాటి సీమ కథలలోని ‘యాస’ లేకపోవడంవల్ల సులువుగానే చదువుకోవచ్చు. చాలా కథలలో మధ్యతరగతి నేపథ్యమే గోచరిస్తుంది. కాలపరంగా ఇవి మొదటి తరం కథలైనా, ఇతివృత్తం పరంగా ఈనాటికీ వర్తించే కథలే. ఈ పుస్తకంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.
మూడు గడియలకు ముందు వరకూ నిరుపేదగా ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా సంపన్నుడైన వైనాన్ని చెబుతుంది “కడపటి పైసా” కథ.
అవినీతికి లొంగిపోయిన అధికారి, ఓ ఆటవిక, సంచార కుటుంబాన్ని ఎలా విడగొట్టిందీ చెబుతుంది శ్రీ చింతా దీక్షితులు వ్రాసిన “సుగాలీ కుటుంబం” కథ. 1921లో ప్రచురితమైన ఈ కథలోని సంఘటనల లాంటి ఘటనలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో జరుగుతూండడం పాఠకులకు తెలుసు.
పాలకులు మారి, దేశం స్వతంత్ర్యమైనా 1926 నాటి విద్యావిధానం నేటికీ మారలేదని చెబుతుంది “ఒక చిన్న కథ“. రచయిత పేరు తెలియదు. విద్యా విధానంలోని లొసుగులపై ఆనాడే అనేక చురకలు వేసిన కథ ఇది.
మానవసేవయే మాధవసేవ అని చెప్పిన కథ రామచంద్ర వ్రాసిన “ఇరువురు యాత్రికులు“. “అంతరంగంబున నుండు దేవుని విడనాడి బాహ్య ప్రపంచమందున్న విగ్రహముల బూజించుట నిజమైన భక్తికాదు. దుఃఖముల పాల్పడిన మనుజులకు సాయము చేయుటయే భగవంతు నారాధించుట కావున వీరికి దుఃఖవిముక్తి చేయుటయే ప్రధానకార్యంబు” అని అనుకుంటాడు గోపాలయ్య అనే యాత్రికుడు. తిరుపతి ప్రయాణంలో… మార్గమధ్యంలో తనకి ఆతిథ్యం ఒసగిన కుటుంబం కష్టాల్లో ఉంటే వారిని అలా వదిలేసి తిరుపతి వెళ్ళడంలో ప్రయోజనం లేదని భావిస్తాడా యాత్రికుడు. పెద్ద కథైనా ఆసక్తిగా చదివిస్తుంది.
ఆనాటి రాజకీయ వ్యవస్థపైనా, సీమలో త్రాగునీరు సమస్యపైనా వ్రాసిన వ్యంగ్య కథ “భగీరథ ప్రయత్నం“. ఈ కథని 1930లో వ్రాసినా, ఇప్పటికీ సమకాలీన కథలానే అనిపించడం విశేషం.
కుహానా ఆధ్యాత్మికవాదులు, కపట సన్యాసులపై వ్రాసిన కథ “సన్యాసం“. ఈ కథ నవ్వించినా, సమాజం తీరు తెన్నుల పట్ల బాధనూ కలిగిస్తుంది.
నడమంత్రపు సిరి ప్రభావంతో హోదాలు పెరిగి, మూలాలను మరచిపోతే వచ్చే ఎదురయ్యే పరిణామాలని “బ్లాకీ కుక్క చరిత్ర” కథ చెబుతుంది. కందాళ శేషాచార్యులు గారు వ్రాసిన ఈ కథ ప్రతీకాత్మకమైనది.
తొందరపడి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ ఉపాధ్యాయుడు, రాజీనామాని ఉపసంహరించుకోవాలనుకుంటాడు. కాని అప్పటికే ఉత్తరాన్ని పోస్టు చేసేశాడు. పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి విచారిస్తే.. టపా వెళ్ళిపోయిందని తెలుస్తుంది. నిరాశగా ఇంటికి చేరిన అతనికి… ఇంట్లో తనకోసం ఓ ఉత్తరం ఎదురుచూస్తూ కనబడింది. దాంట్లో ఏముందో తెలుసుకోవాలంటే “రాఘవేంద్రరావుగారి రాజీనామా” కథ చదవాలి.
బతకలేక బడిపంతులనే సామెతని నిజం చేసిన కథ “ఉగాది కానుక“. వచ్చిన జీతమంతా అప్పులు తీర్చడానికే సరిపోతే, రాబోయే పండుగ ఎలా గడవాలి అని భయపడిన ఓ ఉపాధ్యాయుడికి ఎదురైన ఆనందకరమైన సంఘటన ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.
1940లో విద్వాన్ విశ్వం వ్రాసిన “నీతులు” కథ నేటికీ వర్తిస్తుంది. స్వేచ్ఛావ్యాపారం యొక్క దుష్ఫలితాలను ఆనాడే ప్రస్తావించారీ కథలో. నీతులనేవి పాలితులకే గాని పాలకులవి కావని, నీతినియమాలను సక్రమంగా అమలు చేయాలంటే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం ఉండాలని రచయిత అంటారు.
ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించిన కథ “బడిపంతులూ!“. కందాళ శేషాచార్యులు గారు వ్రాసిన ఈ కథలోని చాలా పరిస్థితులూ నేటికి ఉపాధ్యాయులకు ఎదురవుతున్నాయి.
కన్యాదాతని ఏడ్పించి ఉన్నత చదువులు చదవాలని ఆశించే పెళ్ళికొడుకులకు హెచ్చరికలాంటి కథ కందాళ శేషాచార్యులు గారి “బి.ఏ. అర్జీ“.
షాహుకార్లు చేసే దుండగాలూ, ఫలితంగా బీదవారు పడే ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టుగా చిత్రించిన కథ “కడగండ్లు“. కె. సభా గారు వ్రాసిన ఈ కథ పాఠకుల హృదయాలను కదిలిస్తుంది.
వైవిధ్యభరితమైన జీవన పార్శ్వాలు ఈ కథలలో కనిపిస్తాయని సంపాదకులు పేర్కొన్నారు. వారి మాటలు అక్షర సత్యాలు.

240 పేజీల ఈ పుస్తకం వెల రూ. 200/- అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈ బుక్ కినిగెలో లభిస్తుంది. ప్రతులకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు.
కె.మురళీమోహన్,
ఫ్లాట్ నెం.9111,
బ్లాక్ నెం.9 ఏ,
జనప్రియ మహానగర్,
మీర్‌పేట్,
హైదరాబాదు 500 097

Tags: , , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment