Home » Book Intro » ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు – పుస్తక పరిచయం

 

ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు – పుస్తక పరిచయం

 

?

?

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం జీవితాంతం శ్రమించిన మహోన్నత వ్యక్తిత్వాలని, ఔన్నత్యాన్ని చాటే కథల సంపుటి “ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు”. ఈ రచన హిస్టారికల్ ఫిక్షన్ విభాగంలోకి వస్తుందని అంటూ, ఇందులోని 32 కథలకు చారిత్రక ఆధారాలున్నాయని, చరిత్రలో ఆయా ఘటనలు వాస్తవంగా సంభవించాయని చెబుతారు రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ.

ఇటువంటి మహోన్నత వ్యక్తుల గాథలను కొన్ని పరిచయం చేసుకుందాం.

“భౌతిక విజయం తాత్కాలికం, మానసిక విజయం శాశ్వతం. నేను కాలాన్ని జయించాలనుకుంటున్నాను” అన్న చాళుక్య రాజ్య వంశీకుడు కృష్ణ మహారాజు చరిత్రలో నిలిచిపోయేలా – ఓ గొప్పపని చేసాడు. “భావి తరాలకు మన ఔన్నత్యాన్ని ప్రదర్శించి వారి ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను.” అని తన సేనానితో చెప్పిన ఆ మహారాజు నిర్మింపజేసిన అపూర్వమైన కట్టడాలు ఏవో తెలుసా? అవే – భారతీయులకు పూర్వీకుల ఔన్నత్యాన్ని చాటుతూ స్ఫూర్తిమంతంగా నిలిచిన ఎల్లోరా గుహలు.

“తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయని వాడికి రక్షణ కోరే హక్కు లేదంటూ” కదనరంగంలోకి దూకి సైన్యాన్ని విజయం వైపు నడిపింది త్రిభువన మహారాణి. ఉత్కళ రాజ్యాన్ని పాలించిన తొలి మహిళ. ప్రజలకు మేలు జరిగేలా పాలించి, భారతీయ మహిళాశక్తిని ప్రపంచానికి చాటింది.

“చేయి చాస్తే అందే దూరంలో గమ్యం ఉన్నప్పుడు మనిషిని ఎందుకని సందేహాలు చుట్టుముడతాయో?” అన్న ఆలోచన పుష్యమిత్రుడిని కదిలిస్తోంది. భవిష్యత్తు తనని ద్రోహిగా పరిగణిస్తుందా? తన చర్యలోని సమంజసత్వాన్ని గ్రహిస్తుందా? అని సంశయించాడు అతడు. ఏ లక్ష్యంతో పుష్యమిత్రుడు అధికారం హస్తగతం చేసుకున్నాడో, అది ఎలా నెరవేరింది? “ఏ ధర్మానునూయి అయినా మనిషే, అందరికీ అవే బాధలు, అవే కష్టాలు. అవే ఆనందాలు, విషాదాలు… నాకందరూ సమానమే….. నేనూ అందరివాడినే” అన్న పుష్యమిత్రుడి అంతరంగాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారా?

“శక్తివంతమైన ఆయుధాలుండడం వల్ల విజయం లభించదు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకుంటేనే విజయం ప్రాప్తిస్తుంది” అని ఉద్ఘాటించిన పీష్వా బాజీరావు విజయగాథ స్ఫూర్తిదాయకం.

“ఈ ప్రపంచం నీతో ఆరంభం కాలేదు. నీతో అంతం కాదు.” అన్న రాజగురువు మాటల్లోని ఆంతర్యాన్ని బుందేలా రాజవంశీకుడు చంపక్ రాయ్ గ్రహించాడా? హైందవ పోరాట దీప్తిగా మారాడా?

భూభాగంతో పాటు, సముద్రమార్గంపై కూడా భారతీయుల సార్వభౌమత్వాన్ని విస్తరించేందుకు కృషి చేసిన సముద్ర సింహం – కన్హోజీ ఆంగ్రే తన కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేశాడు? “అనుమానంతో పని ఆరంభించినవాడు అనుమానంతోనే పని ముగిస్తాడు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసినవాడు అసంభవాన్ని సంభవం చేస్తాడు.” అంటూ సేనానికి మార్గదర్శనం చేసి విజయం వైపు నడిపిన నాయకుడు కన్హోజి.

హింసాయుత యుద్ధంలో విజేతలంటూ ఉండరని, మానవ స్వభావంలోని పశుత్వంపై యుద్ధం జరిపి విజేతలుగా నిలవాలని బోధించిన దీపాంకరుడిది చక్కని గాథ.

“నమ్మినదాన్ని సాధించాలని ప్రయత్నించేడప్పుడు మంచి చెడ్డలు విచారించకూడదు. అనుకున్నది సాధించడంపైనే దృష్టి పెట్టాలి” అని దృఢంగా విశ్వసించిన మహిళ, రాజ్య సంరక్షురాలిగా పంతొమ్మిది సంవత్సరాలు రాజ్యభారం నిర్వహించి, ఓ మహా సామ్రాజ్యానికి పటిష్టమైన పునాది వేసింది. ఆమే విరియాల కామసాని. అది కాకతీయ మహా సామ్రాజ్యం.

వీరి గురించే కాకుండా – చైనాకు దేవుడైన మన కుమారదేవుడి గురించి; భక్తి ఉద్యమానికి ఊపిరిలూదిన నరహరి సర్కార్ గురించి; కాంబోడియాలో అంకోర్‍వాట్ ఆలయం నిర్మించిన రాజు గురించి; భారతదేశ ఆధ్యాత్మిక భక్తి ఔన్నత్యాన్ని తను సృజించిన భజనలు, గీతాలతో – ప్రపంచానికి చాటి చెప్పిన సురదాసు గురించి; జాతీయ భావాలను ప్రేరేపించే సాహిత్యాన్ని సృజించి భావి తరాకలు ప్రేరణిచ్చిన భూషణ కవి గురించి; మేధావులు సామాజిక దిశా నిర్దేశనం నిష్పాక్షికంగా, నిర్మోహంగా, నిర్ద్వందంగా చేయాలన్న ఉజ్జ్వల కర్తవ్యాన్ని మనసా వాచా కర్మణా నిర్వహించిన చండీశ్వరుడి గురించి; ఎనభై ఏళ్ళ వయసులో కూడా ధర్మరక్షణకు కత్తిపట్టి పోరాడి విజయం సాధించిన విక్రమ పాండ్యుడి ధర్మదీక్ష గురించి; ప్రపంచ ప్రసిద్ధ కోణార్క ఆలయ నిర్మాణానికి నాంది పలికిన నరసింహదేవుడి గురించి; వైశేషిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కణాదుడి గురించీ; బాబరుని నిలవరించజూసిన రాణా సంగా గురించి చక్కని కథనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

విజయవాడ సాహితి ప్రచురణలు ప్రచురించిన ఈ 248 పేజీల పుస్తకం వెల రూ.100/- ప్రచురణ కర్త చిరునామా:
SAHITHI PRACHURANALU 29-13-53, Kaleshwar Rao Road, Suryarao Peta, Vijayawada – 520002. Ph: 0866-2436643

Tags: , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment