Home » Book Intro » “కథలు ఇలా కూడా రాస్తారు” – పుస్తక పరిచయం

 

“కథలు ఇలా కూడా రాస్తారు” – పుస్తక పరిచయం

 

KathaluIlaKudaRastaruCoverకొన్ని పుస్తకాలను ముందే ఏర్పరుచుకున్న అంచనాలతో చదువుతాం. వస్తువో, రచయితో మనకి పరిచయం ఉన్నట్లయితే, ఏం రాసుంటారో ఊహిస్తాం. ఇక పుస్తకం శీర్షికే అందులోని అంశాలని తేటతెల్లం చేస్తే – చెప్పేదేముందీ? నాకు తెలిసిన విషయాలే అని పాఠకుడు కొద్దిగా అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. అయినా, మొదలుపెట్టాకా చివరి వరకూ ఆస్తకిగా చదివిస్తాయి కొన్ని పుస్తకాలు. ఆ కోవలోకే వస్తుంది మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన “కథలు ఇలా కూడా రాస్తారు” అనే పుస్తకం.

కథలు ఎలా వ్రాయాలో చెప్పే పుస్తకాలకు కొదువలేదు. ఎందరో సీనియర్ రైటర్లు ఈ విషయం మీద ఉపన్యాసాలు ఇచ్చారు, కొన్ని సంస్థలు వర్క్‌షాపులు నిర్వహించాయి. అయితే “ఇలా కూడా రాయొచ్చు” అని ఉదాహరణలోనూ, వివరాలతోనూ అందంగా, అర్థమయ్యేలా చెప్పారు ఖదీర్.

అసలు కథలెవరు రాస్తారు అని ప్రశ్నించి, అందుకు జవాబుగా – కొంచెం యాంగ్జయిటీ న్యూరోసిస్ లాంటిది, భావుకత్వం, కరుణ, నిర్భయత్వం, చూపు ఉన్నవాళ్ళు, చదవడం తెలిసినవాళ్ళు కథలు రాస్తారని అంటారు. కథలు వ్రాయడానికి ఏం కావాలని అడిగి, అన్నిటికన్నా ముఖ్యం జ్ఞాపకశక్తి అని, అది లేకుండా కథ ముందుకు నడవదని చెబుతారు. తర్వాతి ముఖ్యమైనది భాష. కథకి అదెంత కీలకమో చెబుతారు. పడాల్సిన చోట సరైన పదం పడితే ఎంత అందమో, పడకపోతే ఎంత అసంతృప్తి ఉంటుందో చెబుతారు.

కథ ఎప్పుడూ వినోదం కోసం కాదనీ, అన్వేషించడానికని అంటారు. కొత్త వైపు కదలడానికి, తెలుసుకోడానికి, నేర్చుకోడానికి అని చెబుతారు. మరి కథలని ఎప్పుడు పడితే అప్పుడు రాసెయ్యచ్చా? కాదంటారు. రాయవలసిన సమయంలో రాయవలసిన కథని రాయవలసిన పద్ధతిలో రాయగలడం చాలా అదృష్టమంటారు.

కథలకున్న అంగాల గురించి చెబుతూ, థీమ్, ప్లాట్ ల మధ్య తికమకని తొలగించడానికి ప్రయత్నించారు. థీమ్ అంటే ఇతివృత్తం లేదా కథాంశమనీ; ప్లాట్ అంటే – కథ/కథనం లేదా కథావస్తువు లేదా సంఘటనల క్రమం లేదా వృత్తాంతం అని చెబుతారు.

కొత్త రచయితలకి మింగుడుపడనివి – శైలి, శిల్పం అన్నది తెలిసిన విషయమే. ఏది శైలి, ఏది శిల్పం అనేదాన్ని స్పష్టం చేశారు ఖదీర్. ఈ కథను ఇలా తప్ప ఇంకోలా చెప్పలేం అనిపించడం, ఉండి తీరాల్సినవి మాత్రమే ఉండడం ‘శిల్పం’ అని అంటారు. కథ మాట్లాడే పలుకులు ‘శైలి’ అని చెబుతారు. శిల్పానికి సహకరించే వాక్యసముదాయమే శైలి అంటారు.

స్థలమూ, కాలమూ గురించి ప్రస్తావిస్తూ, తమ స్థలకాలాలకు నిర్దిష్టంగా లోబడి ఉంటూనే స్థలాతీతం, కాలాతీతమయ్యేవి గొప్ప కథలని చెబుతారు. కొన్ని కథల్లో వాడే భాషే, చేసే వర్ణలలే స్థలమూ, కాలము అవుతాయని అంటారు. కథలలోని పాత్రలని డీల్ చేయడం ఒక తపనని, ఒక జ్వలనమని అంటారు. ఓ పాత్రకి పేరు పెట్టాలంటే – పాఠకుడిని సౌకర్యంగా ఉంచి, వాడికి తెలిసిన పరిధిలోకి పాత్రని చేరువ చేసేలా చూడాలంటారు. రచయితగా పేరు రావాలంటే – కథకి పేరు పెట్టడం సరిగా రావాలంటారు ఖదీర్.

కథలకి సంభావ్యత ఎంతో కీలకమంటారు ఖదీర్. సంభావ్యత అంతే కృతకత్వానికి చోటు లేకపోవడమంటారు. ‘నేను’ కథలకీ, ‘అతడు’ కథలకీ ఉండే తేడాని సుస్పష్టంగా చెబుతారు. ఆయా కథల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతారు. కథలకి కీలకమైన సంభాషణలంటే – రచయిత పలికించేవి కాకుండా – పాత్రలు పలికేవి అని చెబుతారు. సరైన పంక్చుయేషన్ ఉంటే చదవడం ఎంత సుఖంగా ఉంటుందో చెబుతారు.

కథకి ప్రారంభం, ముగింపు ఎంత గొప్పగా ఉండాలో ప్రముఖుల కథల ద్వారా చెప్పి మనల్ని అబ్బురపరుస్తారు. కథ ఎలా ఉండాలో చెప్పడం ఆపి, రెండు చేతులా రాయమంటారు – కంప్యూటర్‌తో. విమర్శని ఎలా తట్టుకోవాలో చెబుతారు. పుస్తకం ఎప్పుడు ఎలా వేయాలో చెబుతారు. అనవసరపు పరిచయాలు రచయితలకి ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతారు.

చివరాఖర్లో – చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. ఇక రాయడం చేయాలి అంటారు. రాయమంటారు – కుదురుగా, స్థిరంగా. కథ – కథకుడు చేసే ప్రయాణంలో మనం ఒకరికొకరు తారసపడుతూనే ఉంటాం అంటూ ముగిస్తారు. ప్రతీ వ్యాసం చివరా, నోట్సులో ఆ వ్యాసంలో ఉదహరించిన రచయితల గురించి తగినంత ఉపయుక్త సమాచారం అందించారు.

కొత్త రచయితలకి అందరూ చెప్పే ఒకే మాట – అధ్యయనం చేయమని. కాని ఆ అధ్యయనం ఎలా చెయ్యాలో చెప్పినవారు తక్కువ. ఈ పుస్తకం ద్వారా ఖదీర్ ఆ పని చేశారు. కథా రచయితలు అవుదామనుకునే వారు – ఏకబిగిన చదివాల్సిన పుస్తకం కాదు, ఆపుతూ, ఆలోచిస్తూ, దిద్దుకుంటూ చదవాల్సిన పుస్తకం ఇది. కావలి ప్రచురణలు ప్రచురించిన ఈ 326 పేజీల పుస్తకం వెల రూ. 225/- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది.

Tags: , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment