Home » Uncategorized » పూణెలో పచ్చని కొండల నడుమ శ్రీనివాసుడు

 

పూణెలో పచ్చని కొండల నడుమ శ్రీనివాసుడు

 

ది. 2 సెప్టెంబర్ 2016 నాడు కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం సకుటుంబంగా పూణెకి వెళ్ళాను. ఆకుర్డిలో మా మరదలి ఇంట్లో మకాం. పని పూర్తయ్యాక, వినాయక చవితి పండగ (5 సెప్టెంబర్ 2016) అక్కడే జరుపుకుని, ఆరో తేదీన తిరుగు ప్రయాణమవ్వాలనేది మా ప్రణాళిక. అయితే నగరంలోనే ఉంటున్న మా కజిన్ శివ మా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరాడు. నగరానికి సమీపంలో ఉన్న ఓ వేంకటేశ్వరాలయానికి తీసుకువెడతానన్నాడు. మొదట నేనంతగా ఆసక్తి చూపించలేదు. కాని శివ వదల్లేదు. ఈ ఆలయం తిరుమల ఆలయాన్ని పోలి ఉంటుందనీ, కొండ మీద ఉంటుందనీ, అక్కడికి వెళ్ళే దారీ, పచ్చని కొండలు పర్యాటకుల్ని/భక్తుల్ని విశేషంగా ఆకట్టుకొంటాయని చెప్పాడు. కొండల మీదకి… అనేసరికి నాకు ఉత్సాహం కలిగింది. తిరుగు ప్రయాణాన్ని ఏడో తారీఖుకి మార్చుకున్నాం. అయిదు రాత్రికే శివవాళ్ళింటికి చేరాం.

6 సెప్టెంబర్ 2016 నాడు ఉదయం తొమ్మిదిన్నర – పది గంటల మధ్యలో హడప్‌సర్ నుంచి మగర్‌పట్టా సిటీ మీదుగా సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలోని కేత్‌కావ్లే అనే ప్రాంతానికి శివ కారులో బయల్దేరాం. సుమారు 19 – 20 కిలోమీటర్లు దాటాకా, సస్వాడ్ సమీపంలో ఓ కోటలాంటి భారీ కట్టడం కనిపించింది. అది పురందరే వాడా. పీష్వాల కాలంలో సస్వాడ్‌ ప్రాంతానికి గవర్నరుగా వ్యవహరించిన సర్దార్ అంబాజీ పురందరే నివాసభవనం. పీష్వా మాధవరావ్‌కి అత్యంత ఆప్తుడైన పురందరే తనూ, తన పరివారం ఉండడానికి నిర్మించుకున్న ఈ విశాలమైన కట్టడం నేడు పాడుబడి, చరిత్రకి సాక్ష్యంగా మిగిలింది. ఇది ప్రైవేటు ఆస్తి, ప్రస్తుతం సందర్శకులకి అనుమతి లేదు. ఈ వాడాకి సమీపంలోనే ప్రాచీనమైన భైరవ్‌నాథ్ ఆలయం ఉంది. శివుడు కాలభైరవుని రూపంలో ఇక్కడ వెలిసాడని ప్రతీతి. ఆలయం బాగా శిధిలమై ఉంది.

అక్కడ్నించి దివే ఘాట్ మీదుగా ప్రయాణం. పశ్చిమ కనుమలలో భాగమైన కొండల వరుస కనువిందు చేస్తుంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం. ఘాట్ రోడ్డు పైకెక్కే కొద్దీ కొండలు ఆకుపచ్చ రంగు పులుముకున్నట్టుగా ఉన్నాయి. గమ్యం కన్నా గమనాన్ని ఎక్కువగా ఆస్వాదించగలిగే మార్గం ఇది. చిన్న చిన్న కొండలు, వాటిపై పచ్చని చెట్లు, పొదలు – కళ్ళకి ఇంపుగా ఉన్నాయి. ఓ మలుపు వద్ద ఆగి దూరంగా కనిపిస్తున్న నగరదృశ్యాన్ని కెమెరాలో బంధించాను. ఘాట్ రోడ్డు మీద ఎక్కుతూ, దిగుతూ ప్రకృతి అందాలకు పరవశిస్తూ, ఫోటోలు తీస్తూ… నారాయణ్‌పూర్ మీదుగా కేత్‌కావ్లే చేరాం.

♣ ♣ ♣

పచ్చని చెట్ల మధ్యనున్న ఆలయపు ప్రవేశద్వారం స్వాగతం పలికింది. దానికి కుడివైపున వినాయకుడి మందిరం ఉంది. విశాలమైన పార్కింగ్ లాట్‌లో బండిని నిలిపి, గుడి వైపు నడిచాం. పార్కింగ్ స్థలం నుంచే గాలి గోపురం, విమాన గోపురం కనిపించాయి. ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నది ప్రముఖ కార్పోరేట్ సంస్థ అయిన వెంకటేశ్వర హాచరీస్ వారి ‘శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ అండ్ రెలిజియస్ ట్రస్ట్’. ఈ ఆలయం నమూనా తిరుమల వేంకటేశ్వరుని ఆలయాన్ని పోలి ఉంటుంది, సేవలు, పూజా పద్ధతులు అన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్ధతుల ప్రకారమే జరుగుతున్నాయి. ప్రధానార్చకులు సైతం తిరుపతి నుంచి వచ్చినవారే. దర్శన వేళలు ఉదయం అయిదు గంటల నుంచి రాత్రి ఎనిమిదింటివరకూ. దర్శనం ఉచితం. మధ్యాహ్నం పూట వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి ఉంది. స్థానికులు ఈ ఆలయాన్ని “ప్రతి బాలాజీ మందిర్” అని పిలుస్తారు.

పచ్చని వృక్షజాలం నడుమ విశాలంగా ఉన్న ఆలయం అత్యంత పరిశుభ్రంగా ఉంది. లోపలికి ప్రవేశించగానే మనసుని చక్కని ప్రశాంతత ఆవరించింది. తిరుమలలో లభ్యం కాని ప్రశాంతమైన దర్శనం ఇక్కడ దొరికింది. స్వామి వారికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకున్నాక, మళ్ళీ పక్కగా వచ్చి నిలబడి స్వామి వారిని దర్శించుకోవచ్చు. ప్రధాన ఆలయంలోనే లక్ష్మీదేవి, గోదాదేవి, కృష్ణుడి ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడి విశేషం ఏమిటంటే – సుదర్శన చక్రానికి సైతం విడిగా ఒక ఉపాలయం ఉండడం! కృష్ణుడి ఆలయానికి పక్కగా భక్తులకు ప్రసాదం పంచే స్థలం ఉంది. ఆలయంలో సేవలు కానీ, పూజలు కాని భక్తులచే జరపబడవు. అన్నీ అర్చకులే స్వయంగా చేస్తారు. పూజాదికాల కోసం భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరు. కార్యక్రమాలన్నీ అర్చకులే నిర్వహించడం కూడా ఇక్కడి పరిశుభ్రతకి ఓ కారణం కావచ్చు. గురువారం నాడు నేత్రదర్శనం, పొంగల్ సేవ; శుక్రవారం నాడు అభిషేకమూ, ఊంజల్ సేవా ప్రత్యేకంగా జరుగుతాయి.

ప్రధాన ఆలయం నుంచి వెలుపలికి వచ్చాక, ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయం ఉంది. అక్కడికి కుడి వైపున అన్నదానం జరిగే గది, సిబ్బంది వసతిగృహాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఎడమ వైపున కుబేర మందిరం ఉంది. కుబేరమందిరానికి పక్కగా వరాహనరసింహస్వామి వారి ఉపాలయం ఉంది. పక్కనే కోనేరు కూడా ఉంది. ఉత్సవాల సమయంలో స్వామివారికి చక్రస్నానం చేయిస్తారిక్కడ. కోనేరు దాటి కొంచెం ముందుకు వెడితే, ఓ పక్కగా, దిగువకి శివాయలం ఉంది.

భక్తులు చెప్పులు పెట్టుకునే చోటా, మొబైల్‌ ఫోన్లు డిపాజిట్ చేసే చోటా ఎటువంటి రుసుమూ చెల్లించనవసరం లేదు. భక్తులకు నగదు అవసరమైతే తీసుకునేందుకు యస్ బ్యాంక్ వారి ఎ.టి.ఎం ఉంది. దేవస్థానం వారి క్యాంటిన్‌లో వడపావ్, టీ ఎంతో రుచిగా ఉన్నాయి. క్యాంటీన్‌ని ఆనుకుని పార్క్ ఉంది. పార్కింగ్ లాట్‌కి సమీపంలో – అక్కడి రైతులు తాము పండించిన తాజా కూరగాయలు, పళ్ళు తెచ్చి అమ్ముతారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే వీటి ధర తక్కువగా ఉంటుంది, నాణ్యతా బావుంటుంది.

పూణె వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ ప్రతి బాలాజీ మందిర్.

♣ ♣ ♣

కొండల మీదుగా దిగువకి ప్రయాణం మరింత ఉత్సాహం కలిగించింది. వర్షాకాలంలో అయితే ఈ కొండల మీద నుంచి వర్షపు నీరు ధారగా రోడ్డు మీదకి పడుతుందట. నారాయణ్‌పూర్‌లో దత్త మందిరం ఉందని చెబుతూ అక్కడికి తీసుకువెళ్ళాడు శివ.

నారాయణ్‌పూర్ సంత్ చాంగ్‌దేవ్ స్వగ్రామమని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. నాథ సంప్రదాయానికి చెంది అద్వైత మార్గాన్ని అనుసరించిన యోగి చాంగ్‌దేవ్. సంత్ జ్ఞానేశ్వర్ తోనూ, అతని తోబుట్టువులతోనూ చాంగ్‍దేవ్ జరిపిన సంవాదం సుప్రసిద్ధమైనది. ఇక్కడి ఈ దత్త క్షేత్రాన్ని స్థానికంగా ‘శ్రీ క్షేత్ర నారాయణ్‌పూర్’ అని వ్యవహరిస్తారు. ఈ దత్త మందిరం విశేషత ఏమిటంటే – స్వామి వారు ఏకముఖి దత్తుడు.

సాధారణంగా దత్తాత్రేయుడంటే మూడు ముఖాలతో ఉండే రూపమే మనకి తెలుసు. ఈ గుడిలో మాత్రం ఒక ముఖంతోనే – మహావిష్ణువుని పోలిన రూపంలో దర్శనమిస్తారు. గుడి మధ్యలో ఓ గదిలో మూడు తలల దత్తాత్రేయుని చిన్న విగ్రహం ఉంటుంది. ఆ గదికి ఉన్న కిటికీ గుండా స్వామివారిని దర్శించుకోవాలి. గురుపౌర్ణిమ నాడు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి సమీపంలోనే ఓ శివాలయం ఉంది. సమయాభావం వల్ల ఆ గుడిని దర్శించలేకపోయాం.

నారాయణ్‌పూర్‌కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో పురందర్ కోట ఉంది. శివాజీ మొఘలాయీలపైనా, బీజాపూర్ సుల్తాన్ ఆదీల్ షాహి పైన జరిపిన పోరాటం నేపథ్యంలో ఆ కోట తరచూ వార్తల్లో ఉండేది. ప్రస్తుతం ఈ కోట ట్రెక్కర్లనీ, పారాగ్లయిడర్లనీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సమయం ఉన్న వారు ఆ కోటను కూడా దర్శించి, చారిత్రక విశేషాలు తెలుసుకోవచ్చు.

ఆనందానుభూతులను కలిగించిన ప్రాంతానికి తీసుకువెళ్ళినందుకు శివకి ధన్యవాదాలు చెప్పాను. మనసుకెంతో ఆహ్లాదాన్ని కలిగించిందీ ఈ ప్రయాణం. సంతృప్తి నిండిన మనసుతో ఇల్లు చేరాం.

♣ ♣ ♣

ప్రతి బాలాజీ మందిర్ చేరే మార్గం:
పూణె – షోలాపూర్ హైవేలో హడప్‌సర్, సస్వాడ్ మీదుగా ఒకదారి.
రెండో మార్గం:
పూణె – సతారా రోడ్‍లో కట్రాజ్ సొరంగం దాటి షిండేవాడి, ఖేడ్ శివపూర్ మీదుగా భోర్ – సస్వాడ్‌ జంక్షన్ చేరితే, ఇక్కడ్నించి ఆలయం సుమారు నాలుగు – అయిదు కిలోమీటర్లు ఉంటుంది.

♣ ♣ ♣

~ రచన, ఫోటోలు – కొల్లూరి సోమ శంకర్

Ekamukhi Datta Photo Courtesy: Sri Kshetranarayanpur Temple’s Facebook Page.

Tags: , , , , , , , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment